విద్య మన జీవితాన్ని మెరుగుపరచే శక్తి.
విద్య లేకుండా జీవించగలిగినా, అది కేవలం జీవరాశిగా మాత్రమే — సార్థకమైన జీవితం కాదు.
మనకు విద్య మూడు స్థాయిలలో లభిస్తుంది — తెలుసుకోవడం, నేర్చుకోవడం, చేరుకోవడం.
1. తెలుసుకోవడం — బోధకుడు
ముందుగా మనం జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకుంటాం — విని, చూసి, ఆలోచించి, అర్థం చేసుకుంటాం.
ఈ దశలో మనకు బోధకుడు అవసరం.
బోధకుడు మనలో జిజ్ఞాసను రగిలిస్తాడు. మనలోని ఆసక్తిని మేల్కొల్పి, తెలుసుకోవాలనే తపన కలిగిస్తాడు.
అతను మార్గం చూపుతాడు, కానీ ఆ మార్గంలో నడవడం మన పని.
తన బోధనతో మనం అతన్ని మించి ముందుకు సాగగలగడం కూడా సాధ్యం.
2. నేర్చుకోవడం — ఆచార్యుడు
తెలుసుకోవడం కంటే గొప్పది నేర్చుకోవడం.
ఇక్కడ కేవలం జ్ఞానేంద్రియాలు కాకుండా కర్మేంద్రియాలు కూడా పనిచేస్తాయి.
“నాకు బండి నడపడం తెలుసు” అని చెప్పడం ఒకటి, “నేను బండి నడపగలను” అనడం ఇంకోటి — ఇక్కడే తేడా!
నిజమైన విద్య అంటే నేర్చుకున్నది శరీరంలో, ప్రవర్తనలో, జీవితంలో లీనమైపోవడం.
ఇది సాధ్యమవుతుంది ఒక ఆచార్యుడు ద్వారా.
ఆచార్యుడు తన ఆచరణ ద్వారానే బోధిస్తాడు.
తాను జీవిస్తున్న విలువలను, క్రమశిక్షణను, నైతికతను ప్రత్యక్షంగా చూపిస్తాడు.
ఎందుకంటే తాను ఆచరించిందే నేర్పగలడు ఆచార్యుడు.
3. చేరుకోవడం — గురువు
జీవితంలో చివరి దశ ఒక స్థితికి చేరుకోవడం, అంటే జన్మ సార్థకతను పొందడం.
“ఎందుకు పుట్టాను?”, “ఈ జీవితం లక్ష్యం ఏమిటి?”, “నేను ఏ స్థితిని చేరుకోవాలి?” —
ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేది గురువు మాత్రమే.
గురువు కేవలం విద్యా బోధకుడు కాదు; ఆయన జీవిత మార్గదర్శి.
మనలోని చీకట్లను తొలగించి, అంతరాత్మలోని వెలుగును చూపిస్తాడు.
తాను అనుభవించిన పరమార్థాన్ని జీవించి చూపించే వాడు గురువు.
ధైర్యవంతుడు మాత్రమే ఇతరులకు ధైర్యం ఇస్తాడు — అలాగే,
ఆత్మజ్ఞాని మాత్రమే ఆత్మజ్ఞానాన్ని ఇవ్వగలడు.
ముగింపు
జీవితంలో ఒక నిజమైన గురువు దొరికితే —
బోధకుడు, శిక్షకుడు, ఆచార్యుడు అందరూ సులభంగా చేరువవుతారు.
ఎందుకంటే అప్పటికి నీకు నీ జీవిత ధ్యేయం స్పష్టంగా కనిపిస్తుంది.
– రవి 🤗🙏





0 Comments